ద్రవిడ ముర్పోక్కు మున్నేట్ర కళగం (డీఎండీకే) పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ సతీమణి ప్రేమలతావిజయకాంత్ ప్రధాన కార్యదర్శి.
– 18వ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక
– సమావేశానికి హాజరైన విజయకాంత్
అడయార్ (చెన్నై): ‘ద్రవిడ ముర్పోక్కు మున్నేట్ర కళగం’ (డీఎండీకే) ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ భార్య ప్రేమలతావిజయకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ 18వ ప్లీనరీ కౌన్సిల్, కార్యవర్గ సమావేశం గురువారం తిరువెర్కాడ్‌లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు విజయకాంత్, కార్యవర్గ సభ్యులు, మహాసభ సభ్యులు, జిల్లా, నగర, పట్టణ, యూనియన్ కార్యదర్శులు సహా 2,500 మంది పాల్గొన్నారు. ఉదయం 11.40 గంటలకు ప్రత్యేక వీల్‌ఛైర్‌లో విజయకాంత్‌ను ఈ సమావేశ మందిరంలోకి తీసుకొచ్చారు. తమ అభిమాన నేతను చూసి కార్యకర్తలు ఉద్వేగానికి లోనయ్యారు. కెప్టెన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భర్త విజయకాంత్ కు పిమ్మట పాదాభివందనం చేశారు. అనంతరం విజయకాంత్ దంపతులను పార్టీ నేతలు పూలమాలలతో సత్కరించారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రేమలత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించి సేవలందించేందుకు అనుమతి ఇచ్చారన్నారు.
పార్టీ అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండా రంగులు వేసుకుని పంచెకట్టి.. కెప్టెన్ ఆరోగ్యంపై ఇటీవల రకరకాల కథనాలు వస్తున్నాయని, అవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేస్తూ మీ ముందుకు వచ్చారు. ఇప్పుడు తన భుజస్కంధాలపై అతిపెద్ద బాధ్యతలు మోపారన్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆమె అన్నారు. అనంతరం ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మైచౌంగ్ తుపాను కారణంగా వరద ముంపునకు గురైన కుటుంబాలకు రూ.15 వేలు, మరణించిన వారికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రభుత్వం బీమా కల్పించి ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారిని కాపాడాలని కోరారు. విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్ను, తాగునీటి పన్ను, డ్రైనేజీ పన్నును తక్షణమే తగ్గించాలని, పాల ధరను పెంచాలని నిర్ణయించారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 15, 2023 | 12:02 PM