పీచు మిఠాయిపై నిషేధం

పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

క్యాన్సర్ కారకాల నిర్ధారణ

చెన్నై, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పీచు మిఠాయిల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలడంతో తమిళనాడు ప్రభుత్వం వాటి విక్రయాలపై నిషేధం విధించింది. ఆహార భద్రత శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు మరియు ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలలో తెలుపు మరియు నీలం రంగులలో పీచు మిఠాయి ప్యాకెట్లను విక్రయిస్తారు. ఇది తియ్యగా ఉండి నోటిలో కరుగుతుంది కాబట్టి పిల్లలు, యువకులు దీన్ని ఇష్టపడి తింటారు. తాజాగా పుదుచ్చేరి బీచ్‌లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను రాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధికారులు స్వాధీనం చేసుకుని వాటి నమూనాలను పరిశోధన నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పరీక్షలో క్యాన్సర్‌కు కారణమయ్యే ‘రోడమైన్ బి’ రసాయనం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో పీచు మిఠాయిల విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించిన పుదుచ్చేరి ప్రభుత్వం.. ఆహార భద్రతా శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ పొందిన తర్వాత పీచు మిఠాయిలను తయారు చేసుకోవచ్చని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో చెన్నై మెరీనా బీచ్‌లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను సీజ్ చేసిన అధికారులు.. వాటి శాంపిల్స్‌ను పరిశోధనలకు పంపగా.. పీచు మిఠాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రోడమైన్ బీ అనే రసాయనం కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయమై ఆహార భద్రతా శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో పీచు మిఠాయిల విక్రయాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

శరీరంలో 45 రోజులు!

ఆహార భద్రత విభాగం అధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ… వస్త్ర పరిశ్రమలో రోడమైన్ బి రసాయనాన్ని వినియోగిస్తున్నామన్నారు. పీచు మిఠాయిలో కూడా ఇలాంటి రసాయనాలు వాడుతున్నారని తెలిపారు. సాధారణంగా 24 గంటల్లోనే రసాయనాలు మూత్రంలో కలిసిపోతాయని, అయితే రోడమైన్ బి రసాయనం శరీరం నుంచి బయటకు వెళ్లేందుకు 45 రోజులు పడుతుందన్నారు. ఈ రసాయనం కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థ, మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుందని.. శరీరాన్ని రక్షించే అణువులను నిర్వీర్యం చేసే సామర్థ్యం ఈ రసాయనానికి ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *