బదిలీలపై సీఎం సానుకూలత..
డీఈవో పోస్టుల భర్తీకి క్లియరెన్స్: హరీశ్
గజ్వేల్/రాంనగర్, నవంబర్ 20: విద్యాశాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని, బదిలీలు, పదోన్నతులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నిధులు మాత్రమే కేటాయిస్తున్నామని, వైద్యారోగ్య శాఖలో కూడా డాక్టర్లు, నర్సులు, బీఫార్మసీ, ఫార్మసీ, డెంటల్ మెడిసిన్, పారామెడికల్ కోర్సులతో పాటు అనేక వైద్య విద్య కోర్సులు ఉంటాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీలు వంటేరి యాదవరెడ్డి, కూర రఘెత్తంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఆర్టీయూ సంఘాన్ని సీఎం కేసీఆర్ గౌరవిస్తారని, సంఘాన్ని నడిపించే మేధావులతో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ వచ్చిందని, త్వరలోనే పదోన్నతులు, బదిలీలు చేపడతామన్నారు. సీపీఎస్ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, జీపీఎఫ్ సొమ్ము విడుదల విషయంలో త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు ఉండేవని, కేవలం 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,950కి చేరుకుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల ఒకేరోజు 17 కాలేజీలు ప్రారంభించి చరిత్ర సృష్టించామని, వచ్చే ఏడాది మిగతా జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని, కేంద్రం సాకులు చెప్పి రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్ల నిధులను నిలిపివేసిందని, అయినా ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హెల్త్ కార్డులకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరవెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో మూడో స్థానం
రాష్ట్ర ప్రభుత్వం వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోందని, దీంతో నేడు తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో దేశంలోనే మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో ఆదివారం జరిగిన ఏఎన్ ఎంల 2వ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక చికిత్స అందించడంలో ANMలు కీలక పాత్ర పోషిస్తారు. హైదరాబాద్‌లో బస్తీ ఆసుపత్రుల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లాలోనూ మొత్తం 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2022-11-21T13:03:02+05:30 IST