టెహ్రాన్: హిజాబ్ వద్దు అంటూ ఇరాన్ మహిళలు 2 నెలలుగా చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం తలొగ్గింది.

హిజాబ్ వ్యతిరేక నిరసనలు
టెహ్రాన్: హిజాబ్ వద్దు అంటూ ఇరాన్ మహిళలు 2 నెలలుగా చేస్తున్న నిరసనలకు ఇరాన్ ప్రభుత్వం తలొగ్గింది. నైతిక పోలీసింగ్ వ్యవస్థను (మోరాలిటీ పోలీస్) రద్దు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చిత్రహింసలకు గురై తమ కస్టడీలో ఉండగానే సెప్టెంబర్ 16న అమిని మరణించింది. అప్పటి నుండి, హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనలను అణిచివేసేందుకు, నిరసనకారులపై కాల్పులు జరపాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశించింది. నైతికత పోలీసుల కాల్పుల్లో గత రెండు నెలల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కూడా మరణించారు. ఎంత మంది చనిపోయినా ఇరాన్ మహిళలు వెనక్కి తగ్గలేదు. మహిళలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైతిక పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది. మోరాలిటీ పోలీసింగ్‌కు న్యాయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే దానిని రద్దు చేస్తున్నట్లు అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటజేరి ప్రకటించారు.
ఇరాన్‌లో షరియా చట్టం అమలులో ఉంది. ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు మరియు మహిళలు దుస్తుల కోడ్‌ను అనుసరించి జుట్టును పూర్తిగా కప్పడానికి హిజాబ్ ధరించాలి. షరియా చట్టాన్ని అమలు చేసేందుకు మోరాలిటీ పోలీసింగ్ విభాగం 2005లో ఏర్పడింది. ఈ ప్రత్యేక పోలీసు డిపార్ట్‌మెంట్‌ను గాస్ట్ ఇ ఇర్షాద్ అని పిలుస్తారు. హిజాబ్ ధరించడాన్ని అమలు చేయడంతోపాటు సరైన డ్రెస్ కోడ్ పాటించని వారిని అరెస్టు చేయడంతో మోరాలిటీ పోలీసింగ్ విభాగం కీలకంగా మారింది. మహిళలను అరెస్టులు చేసి చిత్రహింసలకు గురిచేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమిని మరణం నిరసనల అగ్నిపర్వతం పేలిన తర్వాత, ఇరాన్ చివరకు పశ్చాత్తాపం చెందింది. ఈ విజయం ఇరాన్ మహిళల విజయం.
నవీకరించబడిన తేదీ – 2022-12-04T18:27:57+05:30 IST