వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎగసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారడం లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితి ఇలాగే ఉంటే..

అమరావతి/గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎగసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారడం లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంటే సీన్ ఎలా ఉంటుందో సొంత పార్టీ నేతలు కూడా ఊహించలేకపోతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో మొదలైన అసంతృప్తి కర్నూలుకు పాకగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా మొదలైంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మరో వైపు ద్వితీయ శ్రేణి నాయకులు.. సర్పంచులు, ఎంపీటీసీలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో వైఎస్సార్సీపీలో ఏం జరుగుతుందో నాయకత్వానికి కూడా తెలియడం లేదు.
కారణం ఏంటంటే..
తెనాలి నియోజకవర్గం ఎంపీటీసీ కలిశెట్టి ఫణికుమార్ అధికార పార్టీలో ఉన్నా పనులకు బిల్లులు రావడం లేదని రాజీనామా చేశారు.. గతంలో తెనాలి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, నాయకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని వాపోయారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. సొంత డబ్బులతో చేసిన పనులకు కూడా బిల్లులు (పెండింగ్ బిల్లులు) రావడం లేదని ఎంపీటీసీ అంటున్నారు. ఫణి తన రాజీనామా లేఖను ఎంపీపీకి అందజేశారు.
రాజీనామా లేఖలో ఏముంది?
‘కొలకలూరు ఎంపీటీసీ-2వ సభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెనాలి మండల ప్రజాపరిషత్ ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. మా గ్రామానికి సంబంధించి మండల పరిషత్ తీర్మానాలు అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహించడంతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ సభ్యునిగా నేనే కారణం కాకూడదని భావించి.. చివరి అవకాశంగా మార్చి-01లోగా పనులు ప్రారంభించకుంటే ఇదే నా రాజీనామాగా ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. నేను రాజీనామా పత్రాన్ని మళ్లీ మార్చి-01న రాజీనామా ఫార్మాట్‌లో సమర్పిస్తాను‘ ఫణి తన లేఖలో పేర్కొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-02-05T16:54:48+05:30 IST