తెలుగులోనూ పరీక్ష నిర్వహించండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

ఆ నోటిఫికేషన్‌ను సవరించండి

రిక్రూట్‌మెంట్ పరీక్షను తెలుగులోనూ నిర్వహించాలి

లేకుంటే కోట్లాది మంది హిందీయేతర యువకులు నష్టపోతారు

ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ , ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను తెలుగులోనూ నిర్వహించాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. సీఆర్పీఎఫ్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని సూచించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తే ఇంగ్లిష్ మీడియంలో చదవని వారు, హిందీయేతర నిరుద్యోగ యువత చాలా నష్టపోతారని అన్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం సహా అన్ని అధికారిక భాషల్లో సీఆర్‌పీఎఫ్ పరీక్ష నిర్వహించేలా నోటిఫికేషన్‌ను సవరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది మంది యువతకు సమాన అవకాశాలు కల్పించాలి. వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్రం గతంలోనే తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ నిర్ణయం పూర్తిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక అధికార భాషలు ఉండగా కేవలం హిందీ విద్యార్థులు మాత్రం మాతృభాషలో పోటీ పరీక్షలు రాయడానికి అనుమతించడం దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దేశంలో రాజభాష అనే అంశం లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ప్రాంతీయ భాషలను విస్మరించి హిందీ, ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రజలకు సమాన అవకాశాలు పొందేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కును సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ 2020 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది మంది యువత ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు పొందేలా సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌ను సవరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

నవీకరించబడిన తేదీ – 2023-04-08T12:18:58+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *