లోక్ సభ సభ్యత్వంపై మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం కుమారుడు, తేని అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ కుమార్
– ఇవాళ స్టే రాకపోతే.. ఆయన మాజీ ఎంపీ
అడయార్ (చెన్నై): మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తనయుడు, అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ కుమార్ లోక్‌సభ సభ్యత్వంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎంపీ పదవిని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, అది పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో పిటిషన్‌పై విచారణ జరిపి శుక్రవారం సాయంత్రంలోగా స్టే ఉత్తర్వులు జారీ చేయకపోతే రవీంద్రనాథ్ తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తేని నియోజకవర్గం ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని మొత్తం 40 సీట్లలో డీఎంకే కూటమి 39 సీట్లు గెలుచుకోగా, అన్నాడీఎంకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే రవీంద్రనాథ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఆదాయం, ఇతర వివరాలు దాగి ఉన్నాయని, ఆయన నామినేషన్‌ను ఆమోదించడం చట్ట విరుద్ధమని, అందుకే తన గెలుపును రద్దు చేయాలని తేని నియోజకవర్గానికి చెందిన మిలానీ అనే ఓటరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. రవీంద్రనాథ్ ఎంపిక చెల్లదని తీర్పునిస్తూ పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ రోజువారీ కేసుల జాబితాలో చేర్చబడింది. శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే ఎంపీగా కొనసాగుతారు. లేదంటే శుక్రవారం రవీంద్రనాథ్ మాజీ ఎంపీగానే మిగిలిపోయే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
నవీకరించబడిన తేదీ – 2023-08-04T07:38:24+05:30 IST