నిపా వైరస్: కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది.. ఇప్పటివరకు ఎన్ని కేసులు..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-14T09:36:56+05:30 IST

కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

నిపా వైరస్: కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది.. ఇప్పటివరకు ఎన్ని కేసులు..?

తిరువనంతపురం: కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీంతో కేరళలో నిపా వైరస్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. కేరళ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం, ప్రస్తుతం కాంటాక్ట్ లిస్ట్‌లో 706 మంది ఉన్నారు. 77 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు. హై రిస్క్ కేటగిరీలో ఉన్న వారిలో ఇప్పటి వరకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. హై రిస్క్ కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది. 13 మంది ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వారికి తలనొప్పి వంటి తేలికపాటి లక్షణాలు ఉంటాయి. నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని చర్యలను సమన్వయం చేసేందుకు కేరళ ప్రభుత్వం 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రాథమిక అవసరాలను అందించేందుకు వాలంటీర్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు నిపా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగులోకి వచ్చిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేశారు. వ్యాధిపై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు. ఈ వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సోకుతుందని చెప్పారు. వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) బృందాలు కేరళకు చేరుకుని వైరస్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించామని కోజికోడ్ జిల్లా కలెక్టర్ గీత తెలిపారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు 43వ వార్డులోని ప్రజలను బయటకు రానివ్వబోమని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, మందులు విక్రయించే దుకాణాలను మాత్రమే తెరవడానికి అనుమతిస్తామని వివరించారు. నిత్యావసర దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. ప్రజలు మాస్క్‌లు ధరించాలని, కంటైన్‌మెంట్ ఏరియాల్లో శానిటైజర్లు వాడాలని గీత సూచించారు. ప్రభుత్వ సంస్థలు. విద్యాలయాలు, అంగన్‌వాడీలను మూసివేస్తామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఆరోగ్య నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-14T10:24:00+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *