గత వారం రోజుల్లో రాష్ట్రంలో డెంగ్యూ బాధితుల సంఖ్య 113కి చేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ జ్వరాలు విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది.
– 24 వేల మంది వైద్య సిబ్బందితో నివారణ చర్యలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): గత వారం రోజుల్లో రాష్ట్రంలో డెంగ్యూ బాధితుల సంఖ్య 113కి చేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ జ్వరాలు విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది. డెంగ్యూ జ్వర నివారణకు రాష్ట్రంలో 24 వేల మంది వైద్య సిబ్బందిని నియమించారు. ఇటీవల మధురవాయల్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు డెంగ్యూతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తిరువారూరు, పుదుకోట, తంజావూరు, తిరువణ్ణామలై, కడలూరు తదితర జిల్లాల్లో ఈ జ్వరాలు పెరుగుతున్నాయి. గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ఈ జ్వరంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గత 13 రోజుల్లో ఈ జ్వరంతో 204 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోజుకు సగటున 15 నుంచి 20 మంది డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా, డెంగ్యూ ప్రబలుతున్న ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ రోగులకు పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూరు, కన్నియాకుమారి తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణ్యం (ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం) గురువారం ఈ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ ఉన్న మురుగునీటిలో పెరిగి దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తాయని తెలిపారు. పాత ప్లాస్టిక్ పరికరాలు, పాత టైర్లు, ఇంటిలోని ఏ ప్రాంతంలోనూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ జ్వరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దోమల నిర్మూలన కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-15T06:53:49+05:30 IST