భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. అతను తన వన్డే కెరీర్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 5000 పరుగులు పూర్తి చేశాడు.

రాజ్‌కోట్: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. అతను తన వన్డే కెరీర్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో 5000 పరుగులు చేసిన 17వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో స్మిత్‌కి ఇది 30వ అర్ధ సెంచరీ. ఈ మ్యాచ్‌లో స్మిత్ 61 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 145 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 44 సగటుతో 5054 పరుగులు చేశాడు. ఇందులో 30 అర్ధ సెంచరీలు, 12 సెంచరీలు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ధీటుగా బ్యాటింగ్ చేస్తోంది. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఆసీస్ బ్యాటర్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ టీ20 తరహాలో పరుగులు సాధించింది. 6.1 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసింది. కానీ ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్ తొలి బంతికే పురుష్ కృష్ణ బ్రేక్ చేశాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్‌తో కలిసి మార్ష్ గట్టి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. 20 ఓవర్లలో ఆసీస్ 146 పరుగులు చేసింది. కానీ సెంచరీకి చేరువలో ఉన్న మిచెల్ మార్ష్ ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కు చేర్చాడు. 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేసిన మార్ష్ 4 పరుగుల వ్యవధిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ వెంటనే స్మిత్ (74)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. అప్పటి వరకు ఎక్స్ ప్రెస్ వేగంతో పరుగులు తీసిన ఆసీస్ స్కోరు బోర్డులో స్మిత్ ఔటవడంతో కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత కాసేపటికే అలెక్స్ కారీ (11)ను బుమ్రా ఔట్ చేశాడు. 37 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది.
నవీకరించబడిన తేదీ – 2023-09-27T16:37:35+05:30 IST