స్వర్ణ పోరులో సౌరవ్, పల్లికల్ జోడీ

స్వర్ణ పోరులో సౌరవ్, పల్లికల్ జోడీ

హాంగ్‌జౌ: స్క్వాష్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లోకి భారత ఏస్‌ సౌరవ్‌ ఘోషల్‌ ప్రవేశించాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో సౌరవ్ 11-2, 11-1, 11-6తో లెంగ్ చి హిన్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపికా పల్లికల్‌/హరీందర్‌ పాల్‌ సంధు 7-11, 11-7, 11-9తో లీ కా యి/వాంగ్‌ చీ హిమ్‌ (హాంకాంగ్‌)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్‌లో ఓడిపోతే భారత్‌కు రెండు రజతాలు దక్కుతాయి.

బ్రిడ్జిలో రజతం ఖాయం…: బ్రిడ్జిలో భారత పురుషుల జట్టు రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో మనోలు 2-1తో ఆతిథ్య చైనాపై గెలిచింది. స్వర్ణ పతక పోరులో భారత్ హాంకాంగ్‌తో తలపడనుంది.

క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ; సింధు, ప్రణయ్ కూడా..

బ్యాడ్మింటన్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 24-22, 16-21, 21-12తో లియో/డానిల్‌ (ఇండోనేషియా)పై గెలిచి క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. పివి సింధు 21-16, 21-16తో కుసుమ వర్దాని (ఇండోనేషియా)పై విజయం సాధించి రౌండ్-8కి చేరుకుంది. ఇక ప్రణయ్ 21-12, 21-13తో పనారిన్ (కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. అయితే రౌండ్-16 పోరులో శ్రీకాంత్ 16-21, 17-21తో నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి/థెరిసా 15-21, 21-18, 13-21తో కిమ్/కాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌లో ట్రెసా/సాయిప్రతిక్ రౌండ్-16 మ్యాచ్‌లో మలేషియా జోడీ చెన్/తో చేతిలో ఓడిపోయారు.

పురుషుల హాకీ ఫైనల్లో భారత్

దక్షిణ కొరియాపై 5-3 తేడాతో విజయం సాధించిన భారత పురుషుల జట్టు హాకీ ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో చైనాను ఓడించిన డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో భారత్ స్వర్ణం కోసం ఆడనుంది.

కబడ్డీ జట్ల జోరు..

పురుషులు, మహిళల కబడ్డీ విభాగాల్లో భారత జట్లు తమ విజయాల పరంపరను కొనసాగిస్తున్నాయి. గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ పురుషుల జట్టు 63-26తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. మహిళల గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 54-22తో థాయ్‌లాండ్‌ను ఓడించారు.

చదరంగం..మహిళలకు విజయం..

చెస్ టీమ్ విభాగంలో భారత మహిళలు ఆరో రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై 4-0తో విజయం సాధించారు. ఈ రౌండ్ ముగిసే సమయానికి, మహిళల జట్టు ఎనిమిది మ్యాచ్ పాయింట్లతో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది. పురుషుల జట్టుపై చైనా 2-2తో నిలిచింది. పురుషుల జట్టు కూడా తొమ్మిది మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

నవీకరించబడిన తేదీ – 2023-10-05T01:31:53+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *