టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 93 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 18,000 పరుగులు పూర్తి చేస్తాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడు.

ధర్మశాల: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 93 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 18,000 పరుగులు పూర్తి చేస్తాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (26,026), రాహుల్ ద్రవిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఓవరాల్‌గా 20వ ఆటగాడిగా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 52 టెస్టులు, 255 వన్డేలు, 148 టీ20లు ఆడిన రోహిత్ శర్మ మొత్తం 17,907 పరుగులు చేశాడు. టెస్టుల్లో 46 సగటుతో 3,677 పరుగులు, వన్డేల్లో 49 సగటుతో 10,377 పరుగులు, టీ20ల్లో 30 సగటుతో 3,853 పరుగులు చేశాడు. అతను మొత్తం 45 సెంచరీలు మరియు 98 అర్ధ సెంచరీలు చేశాడు. నాలుగుసార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 264.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్‌లో సమవుజ్జి పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మొదటి స్థానంలో నిలుస్తుంది. రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కివీస్‌ను ఓడించలేకపోయిన భారత్.. ఈసారి ఆ లోటును భర్తీ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు గాయాలు ఇరు జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయాల కారణంగా ఈ మ్యాచ్ ఆడడం లేదు. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు. ఇషాన్ కిషన్‌ను తేనెటీగ కుట్టింది. ఈ ముగ్గురు ఆడతారా? లేదా? మ్యాచ్‌లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
నవీకరించబడిన తేదీ – 2023-10-22T13:08:30+05:30 IST