మదురైలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి సీపీఎం ఆధ్వర్యంలో నల్లజెండాలతో స్వాగతం పలికారు

– మధురైలో సీపీఎం ఆందోళన
– 150 మంది అరెస్టు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మదురైలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి నల్లజెండాలతో స్వాగతం పలికి సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పార్టీ నేతలు, ప్రముఖులు సహా 150 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో మధురైలో ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం సీనియర్ నేత శంకరయ్యకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని మధురై కామరాజ్ యూనివర్సిటీ సిండికేట్ రెండుసార్లు చేసిన ప్రతిపాదనను మధురై కామరాజ్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ రవి తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని ఖండిస్తూ గురువారం ఉదయం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌కు సీపీఎం జిల్లా, నగర శాఖలు సంయుక్తంగా నల్లజెండాలతో స్వాగతం పలికాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విమానంలో మదురై చేరుకున్న గవర్నర్ రవి అక్కడి నుంచి కారులో కామరాజర్ యూనివర్సిటీకి బయలుదేరారు. గవర్నర్ కాన్వాయ్ నాగమలైపుదుకోట సమీపంలోని నాలుగురోడ్ల కూడలికి చేరుకోగానే సీపీఎం నాయకులు నల్ల బెలూన్లను ఎగురవేశారు.
ఆ తర్వాత దాదాపు 150 మంది కార్మికులు నల్లజెండాలు పట్టుకుని గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను వెంటనే ఆమోదించాలని, శంకరయ్యకు డాక్టరేట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను రీకాల్ చేయాలని సీపీఎం నాయకులు, ప్రముఖులు నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న మహిళలు సహా 150 మందిని పోలీసులు అరెస్టు చేసి మూడు బస్సుల్లో తరలించారు. సీపీఎం ఆందోళన కారణంగా మదురై నగరంతో పాటు కామరాజర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి లేకుండానే యూనివర్సిటీ స్నాతకోత్సవం కొనసాగింది. శంకరయ్యకు డాక్టరేట్ ప్రదానం చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినందుకు నిరసనగా స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు పొన్ముడి ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – 2023-11-03T11:08:07+05:30 IST