బెంగళూరు నగరంలోని ఇందిరా క్యాంటీన్లలో కొత్త సంవత్సరం నుంచి కొత్త మెనూ అమలు కానుంది. మెనూలో రాగిముద్ద, మంగళూరు బన్స్, బిసిబేళేబాత్ ఉంటాయని బీబీఎంపీ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని ఇందిరా క్యాంటీన్లలో కొత్త సంవత్సరం నుంచి కొత్త మెనూ అమలు కానుంది. మెనూలో రాగిముద్ద, మంగళూరు బన్స్, బిసిబేళేబాత్ ఉంటాయని బీబీఎంపీ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. ఉదయం అందించే అల్పాహారంలో బ్రెడ్ జామ్ కూడా తాజాగా జోడించబడుతుంది. మామిడి పండ్ల సీజన్‌లో మామిడి పండ్లతో తయారు చేసిన ఆహారాన్ని అందించనున్నారు. ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ కోసం బీబీఎంపీ ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. జనవరి 16 నుంచి వినియోగదారులకు కొత్త మెనూ అందుబాటులోకి వస్తుందని.. నగరంలోని అన్ని వార్డుల్లో ఇందిరా క్యాంటీన్ల పేరుతో మొబైల్ వాహనాలు, ప్రత్యేక క్యాంటీన్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందిరా క్యాంటీన్ల ద్వారా పేదలు, కూలీలు తక్కువ ఖర్చుతో కడుపు నింపుకుంటున్నారు. టెండర్లు పొందిన వారు నాణ్యమైన బియ్యం, నూనె, గోధుమ పిండిని వాడాలని, వీటిని అతిక్రమిస్తే టెండర్లను రద్దు చేసే అధికారం తమకు ఉందని షరతు విధించారు. ఇందిరా క్యాంటీన్లలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు రూ. 5కే టిఫిన్ అందిస్తున్నారు. వినియోగదారులకు మొత్తం 10 రకాల టిఫిన్‌లు రొటేషన్‌లో ఇస్తారు. ఇక మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు వడ్డించే భోజనంలో అన్నం, రాగి ముద్ద, చపాతీలు, రాత్రి 7-30 గంటల నుంచి 9 గంటల వరకు వడ్డించే భోజనంలో దాదాపు ఇవే పదార్థాలను కేవలం రూ.10కే అందిస్తున్నారు. ఇందిరా క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు బీబీఎంపీ ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 23, 2023 | 10:36 AM