– పెండింగ్ బిల్లుపై చర్చ
– సమావేశం సంతృప్తికరంగా ఉంది: రాజ్ భవన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఆర్‌ఎన్ రవితో సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. శాసనసభ ఆమోదించిన ముఖ్యమైన బిల్లులు, ముఖ్యంగా పది యూనివర్సిటీలకు సంబంధించిన ముసాయిదా చట్ట సవరణ బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బిల్లులను ఆమోదించేందుకు తగిన కాలపరిమితిని నిర్ణయించేలా గవర్నర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం శాసనసభలో ప్రతిపాదించిన బిల్లును గవర్నర్ ఆమోదించాలని, గవర్నర్ పదవిని అపాయింట్‌మెంట్ పోస్టుగా గుర్తించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఒకవైపు ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. పెండింగ్‌లో ఉన్న పది బిల్లులను గవర్నర్ వెనక్కి తిప్పి పంపగా, మళ్లీ డీఎంకే ప్రభుత్వం రెండోసారి శాసనసభలో వాటిని ఆమోదించి గవర్నర్‌కు పంపింది. రెండోసారి శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి కొట్టలేకపోయారు. ఈనేపథ్యంలో గవర్నర్ రవి ఆపాడి బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌తో సమావేశమై బిల్లుల పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని సుప్రీంకోర్టు సూచించింది. దీని ప్రకారం ఈ నెల మొదటి వారంలో వచ్చి తనను కలవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను గవర్నర్ కోరారు. ఎనిమిది జిల్లాల్లో తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున సహాయక చర్యలన్నీ పూర్తయిన తర్వాతే గవర్నర్‌ను కలుస్తామని స్టాలిన్ అప్పట్లో గవర్నర్‌కు తెలియజేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రవిని కలిశారు. స్టాలిన్ గవర్నర్ సమావేశ మందిరంలోకి రాగానే గవర్నర్ రవి వంగి వంగి సీఎంతో కరచాలనం చేసి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్‌ను స్టాలిన్ పసుపు శాలువాతో సత్కరించారు. స్టాలిన్‌ను గవర్నర్ పచ్చ శాలువాతో సత్కరించారు. స్టాలిన్‌తో పాటు మంత్రులు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజకన్నప్పన్, న్యాయశాఖ మంత్రి రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా కూడా గవర్నర్‌ను కలిశారు. దాదాపు పావుగంటకు పైగా సమావేశం కొనసాగింది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించాలని కోరుతూ స్టాలిన్ వినతిపత్రం అందజేశారు.
చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయి: ప్రభుత్వం
ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని న్యాయశాఖ మంత్రి రఘుపతి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పది ముఖ్యమైన బిల్లులను త్వరగా ఆమోదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, కెసి వీరమణిలపై నమోదైన అక్రమాస్తులు, అవినీతి కేసులపై దర్యాప్తునకు అనుమతులు జారీ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌తో భేటీకి సంబంధించి ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేసింది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు ఈ విషయంలో రాజ్యాంగ ధర్మాసనంపై నిర్ణయాలు తీసుకోవాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం చర్యలు: గవర్నర్
ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి భేటీ సంతృప్తికరంగా సాగిందని రాజ్‌భవన్ ప్రకటించింది. రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం నడుచుకుంటానని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తన ప్రధాన ఆశయమని ఆ ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తామిరువుర ఒకరినొకరు కలవడం మంచిదన్నారు.