IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. IPL 2024కి దూరమైన సూర్యకుమార్ యాదవ్?

ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో జరిగే ప్రారంభ మ్యాచ్‌లకు సూర్య తప్పుకోవడం ఖాయం. సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడటంపై కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నీ మొత్తానికి దూరమైతే ముంబైకి కోలుకోలేని దెబ్బ. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయానికి గురయ్యాడు. దీంతో త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంతలో సూర్యకుమార్‌ని మరో ఆరోగ్య సమస్య చుట్టుముట్టింది. సూర్య ప్రస్తుతం చీలమండ గాయంతో పాటు స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు.

దీంతో ప్రస్తుతం బెంగళూరులోని ఎన్ సీఏలో ఉన్న సూర్య.. సంబంధిత సర్జరీ కోసం రెండు మూడు రోజుల్లో జర్మనీ వెళ్లనున్నారు. అతను జర్మనీలోని మ్యూనిచ్‌లో స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. సర్జరీ తర్వాత సూర్యకి మూడు నెలల పాటు విశ్రాంతి అవసరం. దీంతో సూర్యకుమార్ యాదవ్ రానున్న రంజీ సీజన్‌తో పాటు ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీంతో బీసీసీఐ రిస్క్ చేయకూడదనుకుంటే ఐపీఎల్ సీజన్ మొత్తానికి సూర్య తప్పుకునే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లోనే నేరుగా బరిలోకి దిగనున్నాడు. అయితే భారత ఆటగాళ్లలో స్పోర్ట్స్ హెర్నియా కొత్త కాదు. గతేడాది కేఎల్ రాహుల్ కూడా జర్మనీ వెళ్లి సంబంధిత సర్జరీ చేయించుకున్నారు. దీంతో 2 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. హార్దిక్ IPL 2024కి అందుబాటులో ఉంటాడు, ఇది ఖచ్చితంగా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య లేకపోవడం ముంబైకి పెద్ద దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *