కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (01/02/24) మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో తమకు కచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయని, ఆర్థిక మంత్రి పెద్దఎత్తున ప్రకటనలు చేస్తారని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అనుకున్నట్టుగానే నిర్మలా సీతారామన్ కొందరికి మేలు చేసేలా ప్రకటనలు చేశారు. ముఖ్యంగా పేదలు, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ.. కొన్ని రంగాలు నిరాశ చెందాయి. పదండి.. ఈ మధ్యంతర బడ్జెట్‌తో ఎవరికి లాభమో, నష్టమో తెలుసుకుందాం.
నష్టాలు
* ఎలక్ట్రిక్ వాహనాలు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. అయితే, దీనికి అవసరమైన $1.2 బిలియన్ల సబ్సిడీ కార్యక్రమం ఈ ఏడాది మార్చిలో ముగుస్తుంది. దీని పొడిగింపుపై నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
* మౌలిక సదుపాయాలు: 11.11 శాతం వృద్ధితో మౌలిక రంగానికి 11.11 లక్షల కోట్లు కేటాయించారు. అయితే.. ఈ రంగంలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని ‘ఆనంద్ రాఠీ గ్రూప్’ వైస్ చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు.
* నగలు: బంగారం దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 15% సుంకాన్ని తగ్గించకపోవడంతో టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కో, కళ్యాణ్ జువెలర్స్ ఇండియా లిమిటెడ్, సెంకో గోల్డ్ మరియు ఇతర ఆభరణాల షేర్లు గురువారం పడిపోయాయి. అధిక దిగుమతి సుంకం కారణంగా, దేశంలోకి బంగారం అక్రమ తరలింపు పెరిగింది, కాబట్టి ఈ పన్నును తగ్గించాలని పరిశ్రమ పదేపదే డిమాండ్ చేసినప్పటికీ, బడ్జెట్‌లో దానికి అనుగుణంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అందుకే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఆయా షేర్లు నష్టపోయాయి.
* పెట్టుబడుల ఉపసంహరణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక-టికెట్ షేర్ల విక్రయాలను ముగించడంలో విఫలమైన తర్వాత భారతదేశం తన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.510 బిలియన్ల నుండి రూ.300 బిలియన్లకు తగ్గించుకుంది. మార్చి 2024 నాటికి పెట్టుబడుల ఉపసంహరణ నుండి రూ. 300 కోట్లు ఉంటుందని అంచనా.
* పన్ను విధానాల్లో మార్పు లేదు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శాఖకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కానీ.. పన్ను విధానాల్లో మార్పుల జోలికి కేంద్రం వెళ్లలేదు. గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్ని ఈసారి కూడా కొనసాగించారు.
లాభాలు
* వ్యవసాయం: సాగులో ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, నూనెగింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. అలాగే.. పాడి రైతులు, మత్స్య సంపదను పెంచేందుకు కొత్త ప్రణాళికలు తీసుకురానున్నారు.
* మధ్యతరగతి ప్రజలు: (మురికివాడలు మరియు అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారు) తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఆశించే వారి కోసం ‘హౌసింగ్ స్కీమ్’ ప్రవేశపెట్టబడుతుంది. దీంతో పాటు.. సామాన్యుడిపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు “రూఫ్ టాప్ సోలరైజేషన్” పథకాన్ని అమలు చేయనున్నారు.
* పర్యాటక: ఈసారి కేంద్రం పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలు ఇవ్వాలని యోచిస్తోంది.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 01, 2024 | 08:23 PM