డెంగ్యూ: వామ్.. బాగా పెరిగిపోయింది… చెన్నైని డెంగ్యూ వణికిస్తోంది

డెంగ్యూ: వామ్.. బాగా పెరిగిపోయింది… చెన్నైని డెంగ్యూ వణికిస్తోంది

– ఒక్కరోజే 54 మంది అస్వస్థతకు గురయ్యారు

– ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన

– మెట్టూరులో 50 మంది ట్రైనీ పోలీసులకు జ్వరం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం చెన్నైలో రోజురోజుకు జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ఎండలు, రాత్రి వానలు విచిత్రమైన వాతావరణ పరిస్థితులతో ఎక్కడ చూసినా మురుగునీరు, దోమలు స్వైరవిహారం చేయడంతో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో 54 మందికి డెంగ్యూ జ్వరం లక్షణాలున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా తమ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. గతేడాది 2.65 లక్షల మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా.. 6430 మందికి జ్వరం వచ్చినట్లు తేలింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 2.42 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని, 4524 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నగరంలో శుక్రవారం 15 మందికి డెంగ్యూ జ్వరం సోకగా, శనివారం 54 మందికి నిర్ధారణ అయింది. నగరవ్యాప్తంగా మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాలుగా గుర్తించిన 17 లక్షల మంది నివాస ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన దోమల నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు గుళికలతో పాటు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ పిచికారీ చేస్తారని వివరించారు. అదేవిధంగా ఇళ్లలో పాత టైర్లు, పగిలిన పూల కుండీలు, ఇతర వ్యర్థాలను కూడా తొలగిస్తామన్నారు. ఈ డెంగ్యూ నివారణ కార్యక్రమాల్లో 318 మంది ఆరోగ్య కార్యకర్తలు, 635 మంది నర్సులు, 954 మంది పారిశుధ్య కార్మికులు, 2324 మంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొంటున్నారని మంత్రి సుబ్రమణ్యం వివరించారు.

మెట్టూరు పోలీసు శిక్షణా సంస్థ

సేలం జిల్లా మెట్టూరులోని పోలీసు శిక్షణా సంస్థలో దాదాపు 50 మంది పోలీసులకు వింత జ్వరం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వారిలో 14 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఎంపికైన వారికి మెట్టూరు ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఆ సంస్థలో 492 మంది శిక్షణ పొందుతున్నారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా తిరుప్పూర్, గంగేయం, కోయంబత్తూర్ తదితర నగరాలకు బందోబస్తు కోసం వెళ్లారు. అప్పటి నుంచి చాలా మంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా 50 మంది పోలీసులకు వింత జ్వరాలు సోకి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *